ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ధర్మపథం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన భక్తిరంజని, భరతనాట్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరువూరుకు చెందిన కొల్లిపర శ్వేత బృందం శివ శివ శివ యనరాద, జయ జయ దుర్గే, అంబ భవాని శారద, చక్కని తల్లికి, సామగానప్రియే తదితర భక్తి కీర్తనలను ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన శృతి కిరణ్ బృందం పుష్పాంజలి, మహాగణపతిం, గజవదనయుతం, అయిగిరి నందిని, అంబా స్తుతి, శివాష్టకం తదితర కీర్తనలకు భరతనాట్య ప్రదర్శన నిర్వహించింది. ముఖ్యంగా అయిగిరి నందిని కీర్తనకు అష్టభుజాలతో ప్రదర్శించిన అభినయం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం అనంతరం కళాకారులకు దేవస్థానం తరఫున ప్రసాదాలు అందజేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.