మత సామరస్యంతోనే సమాజాభివృద్ధి అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలి లూథరన్ చర్చి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు, మేజర్ న్యూస్ : మత విశ్వాసాలు వేరైనా మానవత్వం, సోదరభావమే అందరినీ ఏకం చేస్తాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకు పట్టణంలో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.మత సామరస్యం, పరస్పర గౌరవం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. 2018లో చర్చి నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాను, నేడు అదే చర్చి ప్రారంభోత్సవంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. వందల సంవత్సరాల పాటు నిలిచేలా అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో చర్చిని తీర్చిదిద్దిన నిర్వాహకులను అభినందించారు.ప్రజలపై అధికారం చలాయించడం కాదు.. వారికి సేవకుడిగా పనిచేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. చర్చి నిర్మాణంలో ఎదురైన సమస్యల పరిష్కారానికి సహకరించామని, మిగిలిన పనుల పూర్తికి కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.తణుకు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక సామరస్యానికి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పాస్టర్స్ అప్రిసియేషన్ డే సందర్భంగా నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తున్న పాస్టర్ల సేవలను అభినందించారు. చర్చి నిర్మాణానికి కృషి చేసిన సంఘ పెద్దలు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్ అని కుమార్ తణుకు పశ్చిమగోదావరి జిల్లా