మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ
మర్రిపాడు, మేజర్ న్యూస్ : మర్రిపాడు మండలమంటే మా నాన్నకు అమితమైన ప్రేమ అని, ఈ ప్రాంత ప్రజలను తన గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అని ఆయన కుమార్తె ఆనం లీలా కైవల్యారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిపాడు మండలంలోని తిక్కవరం, పల్లవోలు గ్రామాల్లో జడ్పీటీసీ, స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఆనం లీలా కైవల్యారెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో తన తండ్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఒక్క మర్రిపాడు మండల అభివృద్ధికే దాదాపు రూ.2 వేల కోట్ల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు.
మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే తన తండ్రి ఆశయమని తెలిపారు. ప్రస్తుతం కూడా గడచిన రెండేళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి ఆనం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హైలెవల్ కెనాల్ మొదటి దశ పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు తన తండ్రి ప్రత్యేక పట్టుదలతో పనిచేస్తున్నారని వివరించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే మర్రిపాడు ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజల చిరకాల కల సాకారమవుతుందని పేర్కొన్నారు. మర్రిపాడు మండలమంటే మా నాన్నగారికి ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడి ప్రజల కష్టసుఖాలను తనవిగా భావిస్తారని అన్నారు. మా నాన్నకు మీరందరూ ఒక అపురూపమైన కానుక ఇవ్వాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో జడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఆ విజయాన్ని మా నాన్నగారికి బహుమతిగా అందించాలి" అని లీలా కైవల్యారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.