మాజీ సైనికుల అనుభవాలు దేశాభివృద్ధికి దోహదపడాలి..
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్
- త్యాగధనుల సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం
- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోకతోట.సింహాచలం
నరసన్నపేట దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకు అంకితమైన మాజీ సైనికులు, సైనిక సేవల నుంచి విరమణ పొందిన తరువాత కూడా తమ అనుభవాన్ని సమాజ అభ్యున్నతికి వినియోగించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో కూడిన సైనికుల జీవన విధానం యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. నరసన్నపేటలోని ఎన్ఏఆర్ హాల్‌లో త్రివిధ దళాల విశ్రాంత సైనికుల ఆత్మీయ సమావేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నరసన్నపేట సమన్వయకర్త పోకతోట సింహాచలం ఆధ్వర్యంలో, శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించగా, పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సత్యవరం కూడలి నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన ర్యాలీ అనంతరం పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు అందించిన సేవలు వెలకట్టలేనివని, ఎండ, వాన, చలి వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల త్యాగాల ఫలితంగానే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. అలాంటి త్యాగమూర్తులకు సమాజంలో సముచిత గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సైనిక జీవితంలో నేర్చుకున్న క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలను సామాజిక సేవలోనూ ప్రతిబింబించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మాజీ సైనికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని నాయకులు వివరించారు. మాజీ సైనికులు, వారి కుటుంబాలకు పింఛను ప్రయోజనాలు అందించడంలో ‘ఒకే ర్యాంకు–ఒకే పింఛను’ విధానం ప్రాధాన్యతను ప్రస్తావించారు. అలాగే మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించే ఆరోగ్య పథకాలు, పునరావాసం, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోకతోట సింహాచలం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటంలో మాజీ సైనికుల పాత్ర విశేషమని, వారి అనుభవాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పింఛను, వైద్యం, పునరావాసం, ఉపాధి సంబంధిత సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సింహాచలం కోరారు. ఆయా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైన పరిష్కారాల కోసం కృషి చేస్తామని, మాజీ సైనికుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అవసరాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశం కోసం సేవలందించిన మాజీ సైనికులు సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుండి, యువతలో దేశభక్తి భావాలను పెంపొందించాలని నాయకులు ఆకాంక్షించారు. దేశ నిర్మాణం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, జిల్లా ఇన్‌చార్జి ఎస్వీఎస్ ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, మహిళ మొర్చ అధ్యక్షురాలు పైడి. సింధూర, ప్రధాన కార్యదర్శులు చింతు పాపారావు, పెడాడ సూరపునాయుడు, మాజీ సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.