లోతట్టు ప్రాంతంలో కలెక్టర్ విస్తృత పర్యటన
భీమవరం లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన
భీమవరం, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో భీమవరం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రజకపేట, రైల్వే స్టేషన్ రోడ్డు, డీఎన్‌ఆర్ కళాశాల రోడ్డు, మెంటేవారితోట, చినరంగనిపాలెం, ఇండస్ట్రియల్ ఏరియాల్లో పర్యటించి వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. డ్రైనేజీలు, కాలువల్లో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.నరసయ్య అగ్రహారంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతి, విద్యా సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలో ఎక్కడా మురుగునీరు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, తాగునీరు కలుషితం కాకుండా ప్రజలకు సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. శానిటేషన్, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ తాతాబాబు, ఎంహెచ్‌ఓ డా. రాజేష్, ఏఈలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇంచార్జ్ శ్రీనివాస్