లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు!
సూర్య సేవా డెస్క్: లయన్స్ క్లబ్ ఆఫ్ వశిష్ట ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు లయన్ చిక్కాల అరుణ అధ్యక్షతన శుక్రవారం పాత కళ్లజోళ్ల సేకరణ మరియు బాల్య క్యాన్సర్ (చైల్డ్‌హుడ్ క్యాన్సర్) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని లయన్స్ జిల్లా 316 గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ప్రజల వద్ద నిరుపయోగంగా ఉన్న పాత కళ్లజోళ్లను సేకరించి, పరీక్షించిన అనంతరం అర్హులైన పేదలకు అందించడం ద్వారా ఎంతోమంది చూపు సమస్యలు తీరుతాయని, వారికి సరికొత్త వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ లయన్ కుడుపూడి ఉమాదేవి బాల్య క్యాన్సర్ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. చిన్నారుల్లో క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలను తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి సరైన సమయంలో వైద్య చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చని ఆమె వివరించారు.
గౌరవ అతిథులు లయన్ శెట్ అనిల్ కుమార్ జైన్, లయన్ డాక్టర్ పి.ఎన్. శర్మ, లయన్ పప్పు శ్రీ కామేశ్వరి దేవి తదితరులు ప్రసంగిస్తూ.. కంటి ఆరోగ్య పరిరక్షణ, నేత్రదానం ప్రాముఖ్యత మరియు బాల్య క్యాన్సర్‌పై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రీజియన్ చైర్‌పర్సన్ లయన్ జంపన సుమన్ వర్మ, జోన్ చైర్‌పర్సన్ లయన్ రవణం వేణుగోపాలరావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను విజయవంతం చేసిన అతిథులకు, సభ్యులకు క్లబ్ అధ్యక్షురాలు లయన్ చిక్కాల అరుణ కృతజ్ఞతలు తెలిపారు.