కొనిదెన బ్రహ్మగుండం క్షేత్రంలో రెండు తలల నాగసర్పం దర్శనం.. భక్తుల్లో భక్తిభావం
బల్లికురవ మేజర్ న్యూస్:
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన కొనిదెన గ్రామంలోని బ్రహ్మగుండం పుణ్యక్షేత్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు తలల నాగసర్పం కనిపించడం భక్తుల్లో ఆసక్తిని,భక్తిభావాన్ని కలిగించింది.కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నాగసర్పం ఆలయ పరిసరాల్లో సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తోందని స్థానికులు చెబుతున్నారు.పుణ్యక్షేత్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం,పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం,నాగేశ్వర స్వామి ఆలయాల పరిసరాల్లో ఈ సర్పం కనిపిస్తోందని తెలిపారు.ఆదివారం తెల్లవారుజామున ఆలయ పూజారి నాగ బ్రహ్మచారి నిత్య పూజల నిమిత్తం ఆలయానికి చేరుకోగా,పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఉన్న జొన్న చేనులో పడగ విప్పి ఆడుతూ నాగసర్పం కనిపించింది.అనంతరం అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండపం వద్దకు చేరుకుని,నాగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సంచరించినట్లు పేర్కొన్నారు.నాగదేవతకు ప్రతిరూపంగా భావించే ఈ సర్పాన్ని చూసిన భక్తులు ఎంతో భక్తితో దర్శించుకుంటున్నారు.భక్తులు సమర్పించిన పాలను తాగి కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుందని స్థానికులు చెబుతున్నారు.గతంలో ఒక తల కలిగిన నాగసర్పం ఆలయానికి వచ్చేదని,ప్రస్తుతం రెండు తలలతో కనిపించడం విశేషమని భక్తులు పేర్కొంటున్నారు.మహాదేవుని ప్రతిరూపంగా భావిస్తూ ఈ నాగసర్పం దర్శనం తమకు లభించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తున్నారు.ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వెళ్లిపోతుండటంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కొణిదెన నరేంద్ర: బల్లికురవ మండలం సూర్య రిపోర్టర్