కళ్యాణదుర్గంలో బోల్తా పడిన ఆటో... తృతిలో తప్పిన పెను ప్రమాదం.
కళ్యాణదుర్గం: పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆటో బోల్తాపడిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు మానవత్వంతో స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే ఆటో వద్దకు చేరుకుని దానిని పైకి లేపి డ్రైవర్‌కు సహాయం అందించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆటో స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొద్దిసేపు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు సకాలంలో స్పందించి సహాయం అందించడంతో పరిస్థితి త్వరగా సద్దుమణిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రధాన రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని స్థానికులు సూచిస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.