2047 నాటికి 26.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
సూర్య బిజినెస్ డెస్క్: 2047 నాటికి భారతదేశాన్ని 26.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దీర్ఘకాలిక లక్ష్యానికి ఊతమిచ్చేలా భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కీలక ముందడుగు వేసింది. బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మూలధన మార్కెట్లు, బీమా, పెన్షన్, ఫిన్‌టెక్ రంగాల్లో మొత్తం 15 ప్రాధాన్యతా ఆర్థిక రంగ సంస్కరణలను సీఐఐ ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోలిస్తే 2047 నాటికి అనేక రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేలా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక మూలధన నిధుల లభ్యత, రుణ సదుపాయాల విస్తరణ, ఆర్థిక ఆవిష్కరణలకు అనుగుణమైన నియంత్రణ వ్యవస్థలు కీలకమని ఆయన పేర్కొన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న రుణ లోటును అధిగమించేందుకు సీఐఐ ప్రత్యేక సిఫార్సులు చేసింది. ఎంఎస్‌ఎంఈ రంగంలో సుమారు 25 నుంచి 30 లక్షల కోట్ల రూపాయల మేర రుణ లోటు ఉందని అంచనా వేసిన సంస్థ, ఎగుమతి రుణాల కోసం ప్రత్యేక ఉప లక్ష్యాన్ని కేటాయించాలని కోరింది. ప్రభుత్వ హామీతో కూడిన ఎంఎస్‌ఎంఈ రుణాలకు అగ్ని ప్రమాదాలు, వరదలు, యంత్రాల వైఫల్యం, వ్యాపార అంతరాయాలపై బీమా రక్షణను తప్పనిసరి చేయాలని సూచించింది. అలాగే రీసైక్లింగ్, బ్యాటరీ పునర్వినియోగం వంటి కార్యకలాపాలను ప్రాధాన్యతా రంగ రుణ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది.
బాండ్ మార్కెట్ విస్తరణతో పాటు విపత్తు, వాతావరణ ముప్పుల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు కూడా సీఐఐ పలు కీలక సూచనలు చేసింది. పెన్షన్ ఫండ్లు, బీమా సంస్థలు, ప్రావిడెంట్ ఫండ్ సంస్థలు డబుల్ ఏ కంటే తక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో నియంత్రిత పద్ధతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం ద్వారా కార్పొరేట్ బాండ్ మార్కెట్ లోతు పెరుగుతుందని విశ్లేషించింది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల ముప్పును ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు, వాతావరణ రిస్క్ పూల్‌ను ఏర్పాటు చేయాలని, వీడియో ఆధారిత కేవైసీ ప్రక్రియకు స్పష్టమైన నియంత్రణ చట్రాన్ని రూపొందించాలని ప్రతిపాదించింది.
వికసిత భారత్ కోసం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సంప్రదింపులు ప్రారంభించిన వేళ సీఐఐ సమర్పించిన ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2047 నాటికి 26.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశానికి సుమారు 106 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ఆస్తులు అవసరమవుతాయని సీఐఐ విశ్లేషణ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మూలధన మార్కెట్లలో నిర్మాణాత్మక సంస్కరణలు అమలైతే పెట్టుబడుల ప్రవాహం వేగవంతమై దేశ ఆర్థిక ప్రగతికి కొత్త ఊపు వస్తుందని ఆర్థిక రంగ వర్గాలు భావిస్తున్నాయి.