కోనసీమ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం.. హరీష్ బాలయోగి
కరుణ శ్రీ ని అభినందించిన ఎంపీ…
అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాను పర్యాటక రంగ పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ బాలయోగి పేర్కొన్నారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిస్టరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న గోకరకొండ కరుణశ్రీ ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి "కోనసీమ జిల్లా దేవాలయ పర్యాటక ఆకర్షణలు" అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. ఈ సందర్భంగా ఆమె అమలాపురంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో హరీష్ బాలయోగిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తన పరిశోధన గ్రంథంలోని ముఖ్యాంశాలను కరుణశ్రీ వివరిస్తుండగా, ఎంపీ ఆసక్తిగా ఆలకించారు. జిల్లాలోని దేవాలయ పర్యాటక అవసరాలు, దానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, ప్రతిపాదనల గురించి ఆమెకు వివరించారు. ఈ తరహా ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
కోనసీమ పర్యాటక ప్రాశస్త్యంపై లోతైన పరిశోధన చేసిన కరుణశ్రీ కృషిని అభినందించిన ఎంపీ హరీష్ బాలయోగి, ఆమెను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట భర్త ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర వున్నారు.