కొండపల్లి అభివృద్ధికి రూ.96 కోట్లతో పనులు
కొండపల్లి, మేజర్ న్యూస్: కొండపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సుమారు రూ.96 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కల్పించే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలోని 30వ వార్డులో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి రావి సబితకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ కింద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొండపల్లి మరింత అభివృద్ధి చెందేందుకు 30వ వార్డులో టీడీపీ అభ్యర్థి రావి సబితకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకుడు రావి ఫణితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.