కేవలం పది నిమిషాలు మాత్రమే!
* భోగాపురం ఎంపీపీ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ
భోగాపురం, (మేజర్ న్యూస్): భోగాపురం మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో ప్రొసీడింగ్ అధికారి ఎం. రామారావు సమావేశాన్ని మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి నిర్ణయించిన సమయానికి కూడా సభ్యుల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మరో పది నిమిషాల పాటు మాత్రమే వేచి చూసి, అనంతరం ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఆర్ఓ వెల్లడించారు. దీంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ 6, టీడీపీ 3, జనసేన 3, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకోవడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో సభ్యుల హాజరు, మద్దతు కూడగట్టే ప్రయత్నాలు భోగాపురం ఎంపీపీ ఎన్నికను ఉత్కంఠభరితంగా మార్చాయి.
రిపోర్టర్: వై శ్రీనివాస్ భోగాపురం