telangana
రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు!
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సికింద్రాబాద్ ఎం.జి. రోడ్డులోని రాణిగంజ్ జంక్షన్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి ( ఆర్ యు బి ) పునరుద్ధరణ పనులను రైల్వే అధికారులు నవంబర్ 20 నుండి ప్రారంభించనున్నారు. 6 నుండి 8 నెలల పాటు సాగే ఈ పనుల దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక మళ్లింపులు విధించారు.
తవ్వకాల కారణంగా ఒక క్యారేజ్‌వే ( ఆర్ 2 ) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో (రాణిగంజ్ నుండి ప్యారడైజ్, బోయిన్‌పల్లి వైపు) కేవలం ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు కార్లను మాత్రమే అనుమతిస్తారు. ప్యారడైజ్ నుండి రాణిగంజ్ వైపు వచ్చే తేలికపాటి వాహనాలను డిస్టిలరీ రోడ్డు, కర్బలా జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
ఆర్టీసీ, ట్రావెల్ బస్సులు మరియు భారీ వాహనాలను సి.టి.ఓ, ప్యాట్నీ, ఎస్.బి.ఐ చౌరస్తా, ట్యాంక్ బండ్, కవాడిగూడ మరియు ముషీరాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. భారీ వాహనాల నియంత్రణకు ప్రధాన జంక్షన్ల వద్ద 10 అడుగుల 'హైట్ రిస్ట్రిక్టర్' కడ్డీలను ఏర్పాటు చేశారు.
రద్దీ దృష్ట్యా రాణిగంజ్, ప్యారడైజ్, ప్యాట్నీ, ట్యాంక్ బండ్ పరిసర మార్గాలను నివారించాలని, అత్యవసర సహాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ కోరారు.