andhrapradesh
కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరం
పెనమలూరు, మేజర్ న్యూస్: కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి అన్నారు. పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ.14.28 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నామని, ఆ పథకం పరిధిలోకి రాని వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇప్పటివరకు పెనమలూరు నియోజకవర్గంలో రూ.26 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయనిధి అందించారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.800 కోట్ల సహాయం అందించగా, కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.2,000 కోట్ల సహాయనిధి అందించిందని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడంలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయని అన్నారు. ప్రజలు కోరిన వెంటనే సహాయం అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఓటు వేయాలని కోరారు. తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్‌రావు మాట్లాడుతూ వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు రూ.14.28 లక్షల చెక్కులు అందించడం సంతోషంగా ఉందన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.26 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయనిధి అందించామని తెలిపారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల టీడీపీ అధ్యక్షుడు కోయా ఆనంద్, టీడీపీ నాయకులు సుంకర చిన్నబాబు, అశోక్ చక్రవర్తి, అంగిరేకుల మురళి, బొంగరాల అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.