కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్
తామరాపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ.. కృష్ణవేణికి ప్రజల మద్దతు
నరసన్నపేట, మేజర్ న్యూస్: నరసన్నపేట మండలం కరగాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కరగాం గ్రామం నుంచి తామరాపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో వందలాది మంది ప్రజలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని కృష్ణవేణికి తమ మద్దతు ప్రకటించారు. పంగ బావాజీ నాయుడుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ర్యాలీ సందడిగా సాగింది.
పంగ కృష్ణవేణి గతంలో వెలమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో అవినీతికి తావులేని పాలన అందించడంతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలందరూ తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.