సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు
గ్రామ అభివృద్ధే ప్రధాన అజెండా అని వెల్లడి
పోలాకి, మేజర్ న్యూస్: మబాగం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని తమ నివాసం నుంచి మద్దతుదారులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి జడ్పీహెచ్ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ నిర్ణయించిన ముహూర్త సమయంలో ఎన్నికల అధికారి జి.కళ్యాణ్ చక్రవర్తి కి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయనతో పాటు పలువురు వార్డు సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మబాగం గ్రామంలోని ప్రధాన సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఇటీవల నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలు, ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ఇప్పటికే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. అవినీతికి ఏమాత్రం తావులేని పారదర్శక పాలనతో పాటు, గ్రామ అభివృద్ధినే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలందరూ తనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ధర్మాన ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.