కలెక్టర్ 'అమ్మ' కడుపు నిండా భోజనం, కానీ కన్నీళ్లు తుడవని న్యాయం
కలెక్టర్ 'అమ్మ' కడుపు నిండా భోజనం, కానీ కన్నీళ్లు తుడవని న్యాయం
అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ జిల్లా వ్యాప్తంగా 'కలెక్టర్ అమ్మ' గా పేరు తెచ్చుకున్నారు. ఆమె పేరుకు తగ్గట్టుగానే కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి, సమస్య పరిష్కారం కోసం వచ్చే సామాన్యులకు కడుపు నిండా భోజనం పెట్టిస్తున్నారు. ఆమె వచ్చినప్పటి నుండి, కార్యాలయంలోని ప్రతి సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వారికి భోజనశాల లో అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. భోజనం పరంగా ఆమె చేస్తున్న ఈ సేవ నిజంగా ప్రశంసనీయం. అయితే, ఈ నాణేనికి మరో వైపు కూడా ఉంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు భోజనం కోసం కాకుండా, తమ సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారు. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది.
జిల్లాలో పలు సమస్యలు ప్రధానంగా భూ సమస్యలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు గురించి. అలాగే, రహదారుల దుస్థితి, రైతుల సమస్యలు,ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఈ సమస్యలను విన్నవించడానికి ప్రతి సోమవారం పలువురు తమ ఫిర్యాదులను పట్టుకుని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. తమ సమస్యలను ప్రజా పరిష్కార వేదికలో విన్నవిస్తున్నారు. ఆమె కూడా చాలా సావధానంగా వింటారు. 'తప్పకుండా పరిష్కరిస్తాం' అని హామీ కూడా ఇస్తారు. కానీ, నెలలు గడుస్తున్నా సమస్యల పరిష్కారం మాత్రం జరగడం లేదు. ఫిర్యాదు ఇచ్చిన అనంత కలెక్టర్ అమ్మ ప్రేమతో పెట్టే భోజనం తిని తమకు తమ సమస్య పరిష్కారమైతే చాలు అంటున్నారు ఫిర్యాదుదారులు.
అనకాపల్లి మండలానికి చెందిన ఒక రైతు తన భూమి సమస్య గురించి గత సంవత్సర కాలంగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. 'కలెక్టర్ అమ్మ దగ్గర భోజనం చాలా బాగుంటుంది, కానీ నా భూమి సమస్య మాత్రం అలాగే ఉంది' అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు.
ఈ విషయంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 'భోజనం పెట్టడం మంచిదే, కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడం ప్రాథమిక బాధ్యత కాదా?' అని వారు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ అమ్మ మానవతా దృక్పథాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, ఒక అధికారిగా ఆమె ప్రధాన విధి ప్రజల సమస్యలను పరిష్కరించడం. భోజనం పెట్టినంత మాత్రాన ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలి. కేవలం 'అమ్మ' గా ప్రేమను చూపించడమే కాకుండా, 'కలెక్టర్' గా బాధ్యతను కూడా నెరవేర్చాలి. అప్పుడే ఆమెకు వచ్చిన 'కలెక్టర్ అమ్మ' అనే పేరుకు పూర్తి సార్థకత చేకూరుతుంది. ప్రజలకు కావాల్సింది కడుపు నిండా భోజనం మాత్రమే కాదు, కన్నీళ్లు తుడిచే న్యాయం, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కూడా. ప్రజా సమస్యలు పరిష్కారానికి పనిచేయలేని అధికారులపై కలెక్టర్ అమ్మ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.