జొన్నవాడ శ్రీ కామాక్షితాయి దేవస్థానంలో వైభవంగా శరన్నవరాత్రి కలశ స్థాపన
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పవిత్రమైన పెన్నా నదీ జలాలతో కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర పెన్నా నది నుండి తీర్థ జలాన్ని కలశంలో తీసుకువచ్చి, ఆలయంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి కలశ స్థాపన చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఈ కలశానికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను అధికారులు స్వయంగా పర్యవేక్షించారు.
దేవస్థాన సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ పూజా కార్యక్రమాల ద్వారా లోకకల్యాణం కలగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అశోక్ రెడ్డి, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు,ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.