జనసేన నేత గోపిని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి
సూర్య ప్రతినిధి, అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో విషాదం నెలకొంది. మాచవరంలోని కొర్లపాటి వారి పాలెంలో నివసిస్తున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొర్లపాటి గోపి తండ్రి ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా నిర్వహించిన దినకార్య కార్యక్రమానికి పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దివంగతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జనసేన నాయకుడు కొర్లపాటి గోపితో పాటు వారి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చెందిన పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.