ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ :
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీరామ అపార్ట్మెంట్ వద్ద వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ వార్షికోత్సవ వరసిద్ధి వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఉదయం గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌పై ప్రతిష్ఠించి నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. చెక్కభజనలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల నడుమ భక్తులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మున్సిపల్ పార్కు పరిసర ప్రాంతాలతో పాటు పురవీధుల్లో సాగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.
పోటాపోటీగా వేలంపాటలు
వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పి. సురేంద్ర దాతగా అందించిన వెండి బిళ్లను కె. సురేష్ రూ.70,000లకు దక్కించుకున్నారు. పాలెం శ్రీనివాసులు అందించిన వెండి విగ్రహాన్ని రూ.65,000లకు దక్కించుకున్నారు. అలాగే షేక్ షమీర్ రూ.30,888లకు లడ్డూను, మురళి రూ.40,900లకు నోట్ల దండను, రాజా రూ.15,000లకు కలశం చెంబును వేలంపాటలో దక్కించుకున్నారు. వేలంపాట సందర్భంగా భక్తుల్లో ఉత్సాహం నెలకొంది.
కామునూరు ఏరులో నిమజ్జనం
వేలంపాటల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుని విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో కామునూరు ఏరులో నిమజ్జనం చేశారు. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఉత్సవ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గౌస్, నాగేష్, మురళి, సురేంద్ర తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు