ఘనంగా నాయి బ్రాహ్మణ కార్తీక వన మహోత్సవం!
ఘనంగా నాయి బ్రాహ్మణ కార్తీక వన మహోత్సవం!
సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి.. డీఎస్పీ మరూరు ఉపేంద్రబాబు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
నాయి బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో రాణించాలని డీఎస్పీ మరూరు ఉపేంద్రబాబు ఆకాంక్షించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నాయి బ్రాహ్మణ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (నోపా) ఆధ్వర్యంలో శనివారం బి. తాండ్రపాడులోని తాలూకా పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న నోపా భవనంలో కార్తీక వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ మరూరు ఉపేంద్రబాబు, ఏ. రామ్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని రాజకీయ పార్టీలను కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి, కార్పొరేట్ స్థాయి సెలూన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమానికి నోపా అధ్యక్షుడు పోలీస్ వెంకటస్వామి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్. ధనవిజయుడు, ప్రధాన కార్యదర్శి అనుగొండ మద్దిలేటి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురిని నోపా కమిటీలోకి కొత్తగా చేర్చుకున్నారు. కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది నాయి బ్రాహ్మణులు హాజరయ్యారు.