ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు
బతుకమ్మ, కోలాటాలతో ఎస్‌వీఎల్ క్రాంతి కళాశాలలో ఘనంగా దసరా సంబరాలు
అవనిగడ్డ, మేజర్ న్యూస్; బతుకమ్మ ఊరేగింపు, సంప్రదాయ కోలాటాలు, దసరా వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అవనిగడ్డలోని ఎస్‌వీఎల్ క్రాంతి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా కళాశాల కరస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావు నివాసం నుంచి బతుకమ్మను మేళతాళాల మధ్య కళాశాల వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం విద్యార్థినులు బతుకమ్మ చుట్టూ సంప్రదాయ కోలాటాలు ఆడి ఆకట్టుకున్నారు. విద్యార్థులు ధరించిన వివిధ దసరా వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు వారిలో ఐక్యతాభావం, సాంస్కృతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.వి. నాగేశ్వరరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్. బాబు రాజేంద్రప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.