ఎస్.రాయవరంలో ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్
ఎస్.రాయవరం, నవంబర్ 29, మేజర్ న్యూస్:
తన పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయని అడ్డరోడ్డు పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎల్.రామకృష్ణ వెల్లడించారు. ఆదివారం నాడాయన ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామంలో పోలింగ్ కేంద్రాల వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని సీఐ రామకృష్ణ తెలిపారు. ఉదయం ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట పోలింగ్ కేంద్రాన్ని సీఐ రామకృష్ణ స్వయంగా సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండు మండలాల పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురికి మించి గుమిగూడటం, ర్యాలీలు, ప్రచారం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణ హెచ్చరించారు.