ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక:
సూర్య క్రీడా డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు (పీడీలు) కుంపట్ల ఆదిలక్ష్మి, ఆకుల ఉమా మహేశ్వరరావు వివరాలను వెల్లడించారు. జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ విద్యార్థులు రాష్ట్రస్థాయి బెర్త్‌లను ఖరారు చేసుకున్నట్లు తెలిపారు.
టైక్వాండో విభాగంలో అండర్-14 విభాగం నుంచి కుడిపూడి కావ్య శ్రీ, అండర్-19 విభాగం నుంచి పితాని చరణ్యశ్రీ ప్రతిభ చాటి ఎంపిక కాగా, క్రికెట్ అండర్-19 విభాగంలో బి.అను రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. గ్రామీణ ప్రాంత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను పాఠశాల హెచ్ఎం సాయిరాం, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసి) చైర్మన్ విల్లా లోవరాజు, కోచ్ పి. త్రిమూర్తులు మరియు ఎస్ఎంసి కమిటీ సభ్యులు ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే విధమైన పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.