ఏపీలో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 3 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణ పనులకు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్న పైలట్ గృహ నిర్మాణ ప్రాజెక్టు పనులను కూడా ఈ సందర్భంగా ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సాధారణ కోటా కింద తొలుత 76 వేల ఇళ్లను మాత్రమే కేటాయించిందని, అయితే రాష్ట్ర అవసరాలను వివరిస్తూ తాము చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి మొదటి విడతలోనే ఏకంగా 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని వివరించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు కేవలం నివాసాలు మాత్రమే కాదని, వారి ఆత్మగౌరవ ప్రతీకలని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసుకున్న మూడు లక్షల ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలోపే రాష్ట్రానికి మరో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, ఆ తర్వాత ఇంకో మూడు లక్షల ఇళ్లు అందించి మొత్తంగా తొమ్మిది లక్షల ఇళ్లతో పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాంకేతికతను జోడించి అతి తక్కువ సమయంలో నాణ్యమైన ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు తెలిపారు.