ఎన్టీఆర్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. పటిష్ట ఏర్పాట్లు
విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 288 గ్రామ పంచాయతీలు, 3,088 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 8,35,515 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో 4,06,803 మంది పురుషులు, 4,28,680 మంది మహిళలు, 32 మంది ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 3,287 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 3,615 మంది ప్రిసైడింగ్ అధికారులు, 6,167 మంది ఇతర సిబ్బంది కలిపి మొత్తం 9,782 మందిని విధుల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో నవంబర్ 26న విజయవాడ డివిజన్ పరిధిలోని 73 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో నవంబర్ 29న నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని 138 గ్రామ పంచాయతీలకు, మూడో విడతలో డిసెంబర్ 2న తిరువూరు డివిజన్ పరిధిలోని 77 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. మొదటి విడతలో విజయవాడ డివిజన్లోని నాలుగు మండలాలతో పాటు తిరువూరు డివిజన్లోని రెడ్డిగూడెం మండలంలోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల భద్రత కోసం సుమారు 2,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 50 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, సామగ్రి రవాణా కోసం 395 బస్సులు, 116 ఇతర వాహనాలు కలిపి మొత్తం 511 వాహనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. సర్పంచ్ అభ్యర్థులకు పింక్ రంగు, వార్డు సభ్యుల అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని, ఉల్లంఘనలపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించడంతో పాటు దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టరేట్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందించనున్నట్లు వివరించారు. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సందేహాలు, ఫిర్యాదులు లేదా సమాచారం కోసం 9154970454 కంట్రోల్ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి టి. సీతామహాలక్ష్మి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి. జ్యోతి, విజయవాడ డివిజనల్ పంచాయతీ అధికారి జి.ఎల్.ఎన్.వి. రాఘవన్ పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.