andhrapradesh
ఎన్నికలు ఎందుకు పెట్టారు?
తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, పోలీసులే ముందరుండి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మహిళా అభ్యర్థులను కూడా వదలకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రిటర్నింగ్ ఆఫీసర్ (RO) కార్యాలయానికి చేరుకునేలోపే వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ.. "40 వార్డులు ఉన్న పులివెందులలో కేవలం 20 వార్డులకు మాత్రమే నామినేషన్లు వేయించగలిగాం. మిగిలిన 20 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే స్వయంగా నామినేషన్లు పడకుండా అడ్డుకోవడం అత్యంత దారుణం. నామినేషన్లు వేసేందుకు మా నాయకులు, కార్యకర్తలు రక్షణ కోరితే.. పోలీసులు లాఠీఛార్జ్ చేయడమే కాకుండా, AK47 తుపాకీలతో బెదిరించి కాల్పులకు తెగబడ్డారు" అని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఇంతటి బలప్రయోగానికి ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించిన జగన్.. ప్రతిపక్షాలకు నామినేషన్లు వేసే అవకాశం కూడా ఇవ్వనప్పుడు, అంతగా భయపడేటప్పుడు ఇక ఎన్నికలు ఎందుకు నిర్వహించడమని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సూటిగా నిలదీశారు. నామినేషన్ల వేళ జరుగుతున్న ఈ అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.