ఒక్క ప్రాణనష్టం కూడా జరగకూడదు...
ఒక్క ప్రాణనష్టం కూడా జరగకూడదు...
అమలాపురం మేజర్ న్యూస్ మూడు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలుజారీచేశారు ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, రైతులు, పంటలు, పశుసంపద, ప్రజల ఆస్తులకు నష్టం తగ్గించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 28న యానాం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వరకు గాలులు వీచే ప్రమాదమున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీరప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, వరద ముంపు ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రదేశాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. మూడు జిల్లాల్లో 24 గంటల కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ ఏర్పాట్లు కల్పించాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ కల్పించడంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర రహదారులు, వంతెనలు, వాగుల వద్ద రాకపోకలను నియంత్రించాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు, కల్లాల్లోని ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరచాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, గోదాములు అందుబాటులో ఉంచాలన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, అపరాల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అరటి, బొప్పాయి, కొబ్బరి, ఆయిల్‌పామ్, మామిడి తోటలకు గాలుల ప్రభావంతో నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ముందస్తు హెచ్చరికలు అందించాలని ఆదేశించారు.
పశువులను ముంపు ప్రాంతాల నుంచి తరలించి పశుగ్రాసం, మందులు, పశువైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, చేపలు, రొయ్యల చెరువుల గట్లను పరిశీలించి ఆక్వా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. శ్రీకాకుళంలో వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాలు, పార్వతీపురం మన్యంలో కొండ ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, కోనసీమలో గోదావరి డెల్టా, తీరప్రాంతాలు, ఆక్వా చెరువులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, తుఫాను తీవ్రత సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.