ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మెటీరియల్ పంపిణీ
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, మండల కేంద్రమైన భట్టిప్రోలు నుండి ఎన్నికల పరికరాలను, బ్యాలెట్ బాక్స్ లను మండల స్థాయి ఎన్నికల బూత్ అధికారులకు బుధవారం పంపిణీ చేశారు. స్థానిక తమ్మన మల్లికార్జున రావు ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన శిబిరంలో 14 సెగ్మెంట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లు, తదితర సామాగ్రిని ఎన్నికల పోలింగ్ బూత్ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో భట్టిప్రోలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ యన్ దేవలక్ష్మి, తహసిల్దారు జి నాగరాజు, ఎంపీడీవో ఎస్ వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీవో మల్లికార్జునరావు, ఈవో పి ఆర్ డి విజయబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది అధికారుల నుండి తీసుకున్న మెటీరియల్ లను ప్రత్యేక బస్సులలో ఆయా గ్రామాలకు తరలి వెళ్లారు. ఇందులో భాగంగా భట్టిప్రోలు ఎస్ ఐ కే అమీర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని ఆయా గ్రామాలలోని ఎన్నికల పోలింగ్ బూత్ లకు ప్రత్యేక వాహనాలలో తరలించారు.