ఎన్నికల విధులకు బస్సులు .. ప్రయాణికులకు తిప్పలు!
నరసన్నపేట, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎన్నికల విధుల కోసం జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నింటినీ అధికారులు వినియోగించడంతో బుధవారం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ రవాణాకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు, మహిళా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా బస్సుల కొరత ఇబ్బందిగా మారింది. నరసన్నపేట, పోలాకి, సారవకోట మండలాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను దూర ప్రాంతాలైన ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నందిగాం మండలాలకు ఎన్నికల విధులపై కేటాయించారు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అందుబాటులో ఉన్న ప్రైవేటు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోవడంతో ప్రయాణం మరింత కష్టతరంగా మారింది. ఎన్నికల విధులకు సిబ్బందిని కేటాయించే విషయంలో అధికారులు అనుసరించిన విధానంపై స్థానికులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులకు సాధ్యమైనంత వరకు సమీప మండలాల్లోనే విధులు కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు జిల్లా అధికారులను కోరినా స్పందన లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థపై పడే ప్రభావాన్ని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిర్వహణతో పాటు సాధారణ ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.