ఎన్నికల వేళ అభ్యర్థులకు కీలక సూచనలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : ఆదివారం జరగనున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, 62 డివిజన్ల అభ్యర్థులు మరియు మేయర్ అభ్యర్థితో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు కీలక సూచనలు చేశారు. వారితో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థులందరూ రాత్రికి లోపే తమ డివిజన్ల పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లను వంద శాతం పూర్తి చేసుకోవాలని, తమ పరిధిలోని RO, ARO మరియు ఎన్నికల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే భవిష్యత్తు కౌంటింగ్ ఏర్పాట్ల కోసం కౌంటింగ్ ఏజెంట్లను కూడా ముందే సిద్ధం చేసుకొని అధికారిక అనుమతులు పొందేలా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిబంధనల ప్రకారం ఒక ప్రధాన ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవాలని, అభ్యర్థులు తమ బూత్ ఏజెంట్లకు పోలింగ్ విధానం, ఓటర్ల గుర్తింపు పరిశీలన, మాక్ పోలింగ్, ఓటింగ్ శాతం నమోదు మరియు పోలింగ్ ముగింపు ప్రక్రియలపై పూర్తి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకే బూత్ ఏజెంట్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, పోలింగ్ ప్రారంభానికి ముందు నిర్వహించే మాక్ పోలింగ్‌ను తప్పనిసరిగా నిశితంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఓటింగ్ సమయంలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందో లేదో గమనిస్తూ, అభ్యర్థులు తమ బూత్ ఏజెంట్లతో ఫోన్ ద్వారా నిరంతర సమన్వయంలో ఉండాలని సూచించారు. బూత్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు అభ్యర్థి సంతకంతో కూడిన నియామక పత్రం తీసుకెళ్లి ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో డిక్లరేషన్‌పై సంతకం చేసి అనుమతి పొందాకే బూత్‌లోకి ప్రవేశించాలన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినా వెంటనే సంబంధిత ప్రిసైడింగ్ ఆఫీసర్, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు సూచించారు.