ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం..
విజయవాడ మేజర్ న్యూస్ : జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం శనివారం విజయవాడ లయోలా కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ బృందాలకు అందిస్తున్న ఎన్నికల సామగ్రిని, వివిధ ఫారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 222 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేందుకు మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించామని.. సీసీటీవీ కెమెరాలతో పాటు వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు క్రియాశీలంగా పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ), ఎంసీఎంసీ, అకౌంటింగ్ బృందాలు వంటివి సమష్టి కృషితో పనిచేస్తున్నాయని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ధ్యానచంద్ర హెచ్ఎం వివరించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.