ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు
పార్వతీపురం మన్యం, సూర్య : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో నవంబర్ 5వ తేదీ గురువారం దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–1988లోని సెక్షన్ 31(2) ప్రకారం కార్మిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీకి మార్చిన నేపథ్యంలో, గతంలో ప్రకటించిన వేతనంతో కూడిన సెలవు తేదీని కూడా నవంబర్ 5వ తేదీకి మారుస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులందరికీ ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. కార్మిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లాలోని సంబంధిత అధికారులు, యజమానులు తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి, కార్మికుడు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.