telangana
ప్రజావాణికి 56 దరఖాస్తులు - త్వరితగతిన పరిష్కరించాలి - కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య మంచిర్యాల: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య,వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా మొత్తం 56 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని,సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం అందించాలని,జీఓ నం.59 ప్రకారం ఇళ్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని పలువురు అర్జీలు సమర్పించారు.అలాగే ఇప్పటికే రుసుము చెల్లించిన వారికి పట్టాలు మంజూరు చేయాలని,గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని,శిథిలావస్థకు చేరిన పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు.భూమి ఆక్రమణలపై విచారణ జరిపి న్యాయం చేయాలని,అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు అందాయి.ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.అనంతరం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని గ్రామస్థాయిలో నిర్వహించనున్న జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాలకు సంబంధించిన గోడపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా గిరిజనుల చరిత్ర, సంస్కృతి, వారసత్వం, స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.చిత్రలేఖనం, వ్యాసరచన,కథా రచన, కవితలు,క్విజ్ పోటీలతో పాటు గిరిజన కళలు, చేతివృత్తులు,సంగీతం, నృత్యాలపై శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.విద్య, పోషకాహారం,సంక్షేమ పథకాలు,మొక్కలు నాటడం,పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన గిరిజనులను సన్మానించనున్నట్లు తెలిపారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.