దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని మాలకొండాపురం గ్రామ పరిధిలోని దానిమ్మ తోటల్లో ఎండు తెగులు తీవ్రతను ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం శనివారం పరిశీలించింది. ఉద్యాన సలహాదారు ప్రకాష్ కులకర్ణి, కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రసాద్‌బాబు, శాస్త్రవేత్త వెంకటేష్, పామూరు, కనిగిరి ఉద్యాన శాఖ అధికారులు దానిమ్మ తోటలను సందర్శించి పంట పరిస్థితిని పరిశీలించారు. ఎండు తెగులు నివారణతో పాటు దిగుబడులు పెంచుకునేందుకు రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై పలు సూచనలు చేశారు. ఎండు తెగులు నివారణకు లీటరు నీటికి టెబుకోనజోల్ రెండు మిల్లీలీటర్లు, క్లోరిపైరిఫాస్ నాలుగు మిల్లీలీటర్లు కలిపి చెట్టు మొదలు వద్ద పాదులు బాగా తడిచేలా పోయాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా లీటరు నీటికి కార్బెండజిమ్ ఒక గ్రాము, క్లోరిపైరిఫాస్ నాలుగు మిల్లీలీటర్లు కలిపి చెట్ల మొదళ్ల వద్ద పోయాలని తెలిపారు. అలాగే చెట్లలో తెగుళ్లను తట్టుకునే శక్తి పెంచేందుకు ప్రతి చెట్టుకు మూడు కిలోల వేపపిండి తప్పనిసరిగా వేయాలని సూచించారు. సమగ్ర నీటి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటిస్తూ శాస్త్రవేత్తల సూచనలను అమలు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, ఆదాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకులు కుసుమ, రైతులు పాల్గొన్నారు.