రావులపాలెంలో దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు: కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి!
సూర్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా & రావులపాలెం డెస్క్: దసరా శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా రావులపాలెం మండల కేంద్రంలో దేవీ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆదివారం స్థానిక ఆదిలక్ష్మి నగర్ వద్ద, అలాగే 80 పోర్షన్ల భవనం వద్ద ప్రతిష్టించిన శ్రీ కనకదుర్గ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం గ్రామంలో భక్తులు ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శోభాయాత్ర (ఊరేగింపు)లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర దసరా నవరాత్రులలో జగన్మాత అయిన కనకదుర్గమ్మ కృపాకటాక్షాలు జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలందరిపై నిండుగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు మరియు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కాలనీలు, ప్రధాన కూడళ్లలో భక్తులు భక్తిప్రపత్తులతో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.