చక్కెర వ్యాధికి కళ్ళెం వేద్దాం.....డీఎంహెచ్వో
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : మధుమేహ వ్యాధి నిర్మూలన, నియంత్రణకు జీవన శైలి మార్పు త్వరగా ప్రారంభిస్తే శీఘ్ర ఫలితాలు ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ డయాబెటిస్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మధుమేహ నియంత్రణ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మాట్లాడుతూ మధుమేహ నియంత్రణ, మధుమేహాన్ని వాయిదా వేయడంలో జీవనశైలి మార్పులు అమోఘంగా పనిచేస్తాయని జిల్లా వైద్యాధికారి వివరించారు. ప్రజల్లో త్వరితగతిన సర్వే నిర్వహించి ప్రాథమిక దశలోనే చక్కెర వ్యాధి గుర్తించి నియంత్రిస్తే భారీ ప్రమాదం నుండి తప్పించి నట్లు అవుతుందన్నారు. బేకరీ, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్, ఒత్తిడి జీవనం వ్యక్తిని డయాబెటిస్ వైపు మళ్లీస్తాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు డయాబెటిస్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు విష్ణుమూర్తి, సురేందర్ రెడ్డి, సునీత, సుకుమార్ రెడ్డి, డెమో అధికారి నాగరాజు, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, ప్రమీల దేవి, హేమలత, ఆంజనేయులు, ప్రేమ్, శశికళ, మౌనిక , శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.