భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు
- నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న కర్రోతు బంగార్రాజు దంపతులు
భోగాపురం, సూర్య:
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలోని అమ్మవారి ఆలయం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో మార్మోగింది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజు తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తితో అమ్మవారిని ప్రార్థించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. దుర్గాదేవి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.