భక్తి పారవశ్యంలో ఎస్.రాయవరం మండలం
వైభవంగా దుర్గాంబిక అమ్మవారి నవరాత్రులు ప్రారంభం
ఎస్.రాయవరం, మేజర్ న్యూస్: ఎస్.రాయవరం మండలమంతా ఆదివారం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. మండల వ్యాప్తంగా శ్రీ దుర్గాంబిక అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రమైన ఎస్.రాయవరం కర్రివీధిలో, అలాగే ధర్మవరం అగ్రహారం, తిమ్మాపురం, ఉప్పరపల్లి, లింగరాజుపాలెం తదితర గ్రామాల్లో ఉదయం నుండే పండగ వాతావరణం నెలకొంది. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి విగ్రహాల వద్దకు చేరుకున్నారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, "జై దుర్గా, జై భవానీ" అంటూ భక్తుల శరణుఘోషలతో గ్రామ వీధులు మార్మోగాయి. పూలతో అందంగా అలంకరించిన పల్లకీలపై అమ్మవారి విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తూ ఆలయాల వరకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని మండపాల్లో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు.
అన్న సమారాధనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు
మధ్యాహ్నం పలు ఆలయాల వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది మంది భవానీ భక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి విశేష అలంకరణ, లలితా సహస్రనామ పారాయణ, భజన కార్యక్రమాలు ఉంటాయని, దసరా వరకు ప్రతిరోజూ భక్తుల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.