andhrapradesh
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ల పై టిడిపి శ్రేణులు హర్షం
అవనిగడ్డ, మేజర్ న్యూస్; బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా 34 శాతం రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు, బీసీ సెల్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్ానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని నాయకులు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడినప్పటికీ, వాటిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీనివల్ల సుమారు 16,800 మంది బీసీలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లుగా ఎదిగే అవకాశాలను కోల్పోయారని ఆరోపించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని నాయకులు తెలిపారు. బీసీ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించడం ఇందుకు నిదర్శనమన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.