బీసీల ఆత్మగౌరవానికి అండగా చంద్రన్న
34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు
బీసీల రాజకీయ ప్రాధాన్యతే లక్ష్యం: ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీసీ నాయకులు, టీడీపీ శ్రేణులు
కనిగిరి, మేజర్ న్యూస్ : బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఆదివారం కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ‘బీసీల ఆత్మగౌరవానికి అండగా చంద్రన్న’ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బీసీ నాయకులు, టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయంగా అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి రాజకీయ సాధికారతకు మరింత బలం చేకూరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.