బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
– రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ఏ.వీ.ఎస్.ఎన్. రాజు
కాకినాడ, మేజర్ న్యూస్ :
అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం (International Day for the Elimination of Child Marriage) సందర్భంగా బాల్య వివాహాలు, ముందస్తు వివాహాలు మరియు బలవంతపు వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కాకినాడ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, క్రాఫ్ (CRAF) స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం కాకినాడలోని ఏ.ఎస్.డి. మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత వికాసం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను విద్యార్థినులకు వివరించారు. బాల్య వివాహాల నిర్మూలనలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా సాయంత్రం కాకినాడలోని పి.ఆర్. కళాశాల మహిళా హాస్టల్ విద్యార్థినులతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని, బాలికల హక్కులు, భద్రత మరియు విద్యకు ప్రాధాన్యత కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (SCPCR) చైర్పర్సన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు, కమిషన్ సభ్యులు శ్రీ మండల గంగ సూర్యనారాయణ మరియు కాకినాడ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.హెచ్. లక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ ఏవీయస్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ, బాలికలకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, బాల్య వివాహాల నిర్మూలనను ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. బాలికల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 ప్రకారం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికల బాల్యాన్ని, విద్యను, ఆరోగ్యాన్ని మరియు హక్కులను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ సీడీపీఓ ఏ. జ్యోతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ జి. సత్యనారాయణ, కమిటీ సభ్యులు దుర్గాదేవి, డాక్టర్ పి. వెంకట్రావు, పి. స్రవంతి, డీసీపీయూ సంరక్షణ అధికారులు కె. శ్రీనివాస్, జె. విజయ, ఎం. సుధాకర్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ జి. విజయకుమార్, డీసీపీయూ సోషల్ వర్కర్ ఎస్. చిన్నబాబు, శిశుగృహ సోషల్ వర్కర్ ఓ. లక్ష్మీ రేవతి, చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్ బి.ఎన్. జ్యోతి, కేస్ వర్కర్ పి. సాగర్, జీఎంఎస్కే పరిమళ, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“బాల్య వివాహాలకు స్వస్తి పలుకుదాం – బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం” అనే నినాదంతో ఈ అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.