బాలికల భద్రతపై అవగాహన ఉండాలి
సూర్య, నంద్యాల బ్యూరో:బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణపై నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో చాబోలు గ్రామంలోని మండల ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, ఏఎస్పీ ఉత్తర్వుల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాదు, వెంకటేశ్వర్లు, మహిళా కానిస్టేబుల్ లక్ష్మిదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మంది విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, నో టట్ విధానం పై వివరించారు. ఆపరిచితులు పిలిచినా వెళ్లకూడదని, వారు ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోరాదని సూచించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని, అత్యవసర సమయాలలో 112కు ఫోన్ చేయాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. నకిలీ సందేశాలు, అనుమానాస్పద యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ వివరాలను ఇతరులకు వెల్లడించరాదని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్ లైన్కు సమాచారం అందించాలని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ లో ఉచిత న్యాయ సలహాలు, కుటుంబ కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
*మధుబాబు, నంద్యాల బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*