అంతర్జాతీయ సదస్సులో విశాఖ ఉక్కుకు మూడు బంగారు పురస్కారాలు
గాజువాక, మేజర్ న్యూస్ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగిన 'అంతర్జాతీయ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ సదస్సు ఐసీక్యూసీసీ-2026లో విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్‌ఐఎన్‌ఎల్ మూడు బంగారు పురస్కారాలు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సొసైటీ ఫర్ టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో, ఉక్కు హౌస్‌లోని హెచ్‌ఆర్‌డీ కేంద్రం నుంచి స్టీల్‌ప్లాంట్ బృందాలు 19న ఆన్‌లైన్‌లో తమ అధ్యయన పత్రాలను సమర్పించి విజేతలుగా నిలిచాయి.
ఉత్పత్తి సామర్థ్యం, నిర్వహణ మెరుగుదలపై రూపొందించిన వినూత్న విధానాలకు ఈ పురస్కారాలు దక్కాయి. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగం నుంచి 'యాంప్స్' బృందం ఎం.వి.రమణ, పి.సాయి నరేంద్ర కుమార్, అహ్మద్ వలీ, పి.ఎం.సత్యనారాయణ, కె.సురేష్, ఎస్‌ఎంఎస్-1 విభాగం నుంచి 'సాఫల్య' బృందం జి.శివశంకర్ రావు, భాను కిరణ్ బండ, జి.అప్పారావు, పి.సింహాచలం, యుటిలిటీస్ విభాగం నుంచి 'ఉన్నతి' బృందం నిరంజన్ శైలేంద్ర, భవాని రమ్యశ్రీ ఊటల, సుగుణావతి సీపాన, కె.శ్రీనివాసరావు స్వర్ణ పతకాలను సాధించాయి. ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యం, సమష్టి కృషి, సమస్యలను పరిష్కరించే తీరుకు ఈ అంతర్జాతీయ గుర్తింపు నిదర్శనమని ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం తెలిపింది. విశాఖ ఉక్కుకు పేరు తెచ్చిన మూడు బృందాల సభ్యులను ఆర్‌ఐఎన్‌ఎల్ బృందం ప్రత్యేకంగా అభినందించింది.
రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం