కేంద్ర మంత్రి కిషన్ రెడ్డివి పగటి కలలుః ఎంపీ చామల
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఆట మొదలైందని కిషన్‌రెడ్డి అంటున్నారని, అయితే బీజేపీ తెలంగాణలో ఆట ఆడటం మొదలుపెట్టి మూడు దశాబ్దాలు గడిచినా ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా కొట్టిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. దేశంలో బాతాయి ఆరెంజ్ కలర్లో ఉంటే.. తెలంగాణలో మాత్రం పింక్ కలర్లో ఉంటోందని, ఆరెంజ్ రంగు పింక్ రంగుగా మారుతున్న తీరును తెలంగాణ సమాజం గమనించాలని చామల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెబితే కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని, స్క్రిప్ట్ బీఆర్ఎస్ది.. ప్రజెంటేషన్ బీజేపీదని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిందని, తామే అధికారంలోకి వస్తామని కిషన్‌రెడ్డి చెబుతున్నారని, అసలు ప్రజలకు బీజేపీపై ఎలాంటి నమ్మకం ఉందని అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలా? లేక నిధులు రాకుండా అడ్డుకోవాలా? అన్న విషయంలో బీజేపీ నేతలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఏ లైన్లో ఉన్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు.
తెలంగాణకు పెట్టుబడులు రావడం బీజేపీకి ఇష్టం లేదా? మూసీ అభివృద్ధి జరగకూడదా? ప్రజలు మూసీ మురికిలోనే మగ్గిపోవాలా? హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టకూడదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వచ్చే విదేశీయుల వీసాలు రద్దు చేసిన సందర్భంలో కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దనే ఆలోచనతో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. జీసీసీల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని పేర్కొన్న చామల, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కిషన్‌రెడ్డికి ఏనాడైనా నిజమైన పట్టింపు ఉందా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు కాలేదంటూ విమర్శలు చేస్తున్న కిషన్‌రెడ్డి ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు ఎక్కారా అని ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ లేదని, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అనవసరంగా అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్న బీజేపీ నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.