రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం
సూర్య బోయినపల్లి..
రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి కె. ప్రణిత తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యవసాయ పనులకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలు, డ్రోన్లు తదితరాలను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ పథకానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు మరియు రైతు సహకార సంఘాలు అర్హులని తెలిపారు.
ఈ పథకం కింద యంత్ర పరికరాల కొనుగోలుకు గరిష్ఠంగా 40 శాతం వరకు రాయితీ, సుమారు రూ.20 లక్షల వరకు అందించే అవకాశం ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు ఆధునిక యంత్రాలతో సాగు పనులు సులభతరం కానున్నాయని అన్నారు. కావున అర్హత కలిగిన సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కె. ప్రణిత కోరారు.