telangana
ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం
సూర్య, మందమర్రి : ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదిల్‌పేట్ గ్రామ సర్పంచ్ నెండుగురి పున్నం సూచించారు. శనివారం మండలంలోని అదిల్‌పేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో మహేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పింఛన్లకు సంబంధించి 25 మంది లబ్ధిదారులకు సర్పంచ్ నెండుగురి పున్నం, ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్ తదితరులు కలిసి మంజూరు పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఇందిరమ్మ బీమా పథకంలో నమోదు చేసుకొని ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.