telangana
పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
హైదరాబాద్, నవంబర్ 21: కొత్తగా విడుదలయ్యే సినిమాలను థియేటర్లలో రహస్యంగా రికార్డ్ చేసి పైరసీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను కర్నూలుకు చెందిన షేక్ రిజ్వాన్ (19), రాంపోగు అజయ్ (19)లుగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ కర్నూలులోని ఎస్వీసీ (SVC) సినిమాస్ థియేటర్‌లో కొత్త సినిమాలు విడుదలైన మొదటి రోజే తమ మొబైల్ ఫోన్ల సాయంతో హెచ్‌డీ క్వాలిటీలో రికార్డింగ్ చేసేవారు. అనంతరం ఆ వీడియోలను అంతర్జాతీయ పైరసీ ముఠాలకు చేరవేసేవారు. ఇలా ఒక్కో సినిమాను రికార్డ్ చేసి పంపినందుకు గాను, పైరసీ ముఠా సభ్యులు వీరికి నేరుగా నగదు ఇవ్వకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో రూ. 20 వేల చొప్పున కమీషన్ చెల్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, నిందితుల కదలికలపై నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సినిమా రికార్డింగ్‌కు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, క్రిప్టో లావాదేవీల నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.