అక్వాన్’ తుఫాను.. యంత్రాంగం అప్రమత్తం!
ఇచ్ఛాపురం ప్రాంతంలో తీరం దాటే అవకాశం
గంటకు 60-80 కి.మీ వేగంతో వీయనున్న బలమైన గాలులు
కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడి
శ్రీకాకుళం, నవంబర్ 18 మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న 'అక్వాన్' తుఫాను జిల్లా వైపు కదులుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైందని, ఇచ్ఛాపురం ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం అందడంతో క్షేత్రస్థాయి సిబ్బందిని రంగంలోకి దించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తుఫాను ముందస్తు చర్యలు ఏర్పాట్లపై మాట్లాడారు.
తుఫాను తీవ్రత అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. తుఫాను ప్రభావంతో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున.. పూరిళ్లు, గుడిసెలు, రేకుల ఇళ్లు కింద నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు లేదా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలివెళ్లాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ సేవలు..
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. గత తుఫానుల సమయంలో వినియోగించిన జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557 (రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబర్లు 1070, 1800 425 0101) ఈసారి కూడా 24 గంటలూ పనిచేస్తుందని, ఏదైనా ఆపద ఎదురైతే తక్షణమే సమాచారం అందించాలని కోరారు.
విద్యుత్, వరద నివారణ చర్యలు..
గత తుఫాను అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను ముందుగానే తొలగించామన్నారు. ఒకవేళ గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగితే పట్టణ ప్రాంతాల్లో 4 గంటల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటల్లోగా మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో ఆకస్మిక వరదల (ఫ్లాష్ ఫ్లడ్స్) ముప్పు ప్రస్తుతానికి పెద్దగా లేనప్పటికీ, పక్కనే ఉన్న ఒడిశాలోని గంజాం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచేందుకు ఒక ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కేటాయించినట్లు తెలిపారు. తుఫాను అనంతరం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వేడివేడిగా వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రసవ గడువు దగ్గరగా ఉన్న గర్భిణులు ముందుగానే సమీపంలోని పీహెచ్‌సీ లేదా సీహెచ్‌సీ ఆసుపత్రులకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, కంట్రోల్ రూమ్ పర్యవేక్షకులు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వర ప్రసాద్, విపత్తు నిర్వహణ సంస్థ అధికారి రాము తదితరులు ఉన్నారు.