సిగ్నల్ లేక.. సేవలు సాగక!
ఎయిర్‌టెల్ కస్టమర్లకు తప్పని తిప్పలు!
మండల కేంద్రంలోనే నెట్‌వర్క్ కష్టాలు
కాల్స్ కలవక.. ఇంటర్నెట్ పనిచేయక
అవస్థలు
ప్రభుత్వ కార్యాలయాల పనులకూ అంతరాయం.. పట్టించుకోని సంస్థ యాజమాన్యం!
సంతబొమ్మాళి, నవంబర్ 18, మేజర్ న్యూస్ :
పెద్ద నెట్‌వర్క్.. మెరుగైన సేవలంటూ ప్రచారం చేసుకుంటున్న ఎయిర్‌టెల్ సంస్థ తీరుకు సంతబొమ్మాళి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఫోన్ కాల్ చేసుకోవడానికి కూడా సరైన సిగ్నల్ అందకపోవడంతో కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా నెట్‌వర్క్ సమస్యలు తలెత్తుతుండటంతో ఎయిర్‌టెల్ సేవలపై నమ్మకం సన్నగిల్లుతోందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే కాకుండా అన్ని రకాల పనులకు కీలకంగా మారింది. ఆన్‌లైన్ చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రభుత్వ సేవలు, విద్యార్థుల ఆన్‌లైన్ కార్యకలాపాలు ఇలా ప్రతి పనికీ ఇంటర్నెట్ అవసరమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతబొమ్మాళిలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సరిగా పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఇళ్లలో ఉన్నప్పుడు సిగ్నల్ పూర్తిగా తగ్గిపోవడం, అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ కలవకపోవడం, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు. ఫోన్‌లో సిగ్నల్ కోసం ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిలబడి మాట్లాడుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నెట్‌వర్క్ సమస్య ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలపైనా ప్రభావం చూపుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాల్సిన పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
ఇంతటి సమస్యలు ఉన్నప్పటికీ ఎయిర్‌టెల్ సంస్థ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సంతబొమ్మాళి మండల కేంద్రం, పరిసర గ్రామాల్లో నెట్‌వర్క్ పరిస్థితిని పరిశీలించి, సిగ్నల్ సమస్యను పరిష్కరించాలని ఎయిర్‌టెల్ వినియోగదారులు కోరుతున్నారు.
కస్టమర్ల నుంచి నెలనెలా చార్జీలు వసూలు చేస్తున్న సంస్థ.. కనీసం నాణ్యమైన నెట్‌వర్క్ సేవలు అందించాల్సిన బాధ్యత లేదా? అన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి